ఇప్పటివరకు ఎంతో మంది సినీ ప్రముఖుల బయోపిక్‌లు తెరకెక్కాయి. ఒక నటుడు లేదా నటి జీవిత కథను బయోపిక్‌గా నిర్మించాలంటే వారిలో ఎన్నో ప్రత్యేకతలు ఉంటే తప్ప అది సాధ్యమయ్యే పని కాదు. ఇటీవల బాలీవుడ్ పాతతరం హీరోయిన్ మీనా కుమారి బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నట్టు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ప్రకటించారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి అక్టోబర్‌లో సినిమాని సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
దీనికి సంబంధించి ఓ వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. మీనా కుమారి బయోపిక్‌ను మేకర్స్ వాయిదా వేస్తున్నారని తెలిసింది. వచ్చే ఏడాది వరకు ఈ బయోపిక్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్ళేందుకు వీలుపడదని వారు భావిస్తున్నారు. దానికి కారణం మీనాకుమారి జీవితం గురించి తెలుసుకోవాల్సింది ఎంతో వుందట. అందుకే మరికొంత సమయం తీసుకుని సినిమా చేస్తేనే ఔట్‌పుట్ బాగా వస్తుందని వారి ఉద్దేశం. ఈ స్క్రిప్ట్ ముగింపు దశలో ఉంది. నటీనటుల ఎంపిక కూడా జరుగుతోంది. అయినా సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. మీనాకుమారి పాత్రకు కృతి సనన్ ఎంపికైంది. దీనికి సంబంధించిన టెస్ట్ షూట్ కూడా జరిగింది. ఆ క్యారెక్టర్‌కి కృతి పర్‌ఫెక్ట్ సూట్ అయిందట. మీనాకుమారి పాత్రకు పూర్తి న్యాయం చేసేందుకు అన్నిరకాలుగా ఆమెను అనుసరిస్తున్నారు కృతి. ఈ క్రమంలోనే సినిమా వాయిదా పడడం ఆమెను బాధిస్తోందట.
మీనాకుమారి అసలు పేరు మెహజబీన్ బాను. ఆమె నటి, గాయకురాలు మాత్రమే కాదు కవయిత్రి కూడా. నాజ్ పేరుతో రచనలు చేసేవారు. 30 ఏళ్ళ తన సినీ కెరీర్‌లో దాదాపు 90 సినిమాల్లో నటించారు. ఆమె నటించిన సినిమాల్లో ఎక్కువగా క్లాసిక్స్ ఉండడం విశేషం. మీనాకుమారి జీవిత చరిత్ర రాసిన వినోద్ మెహతాతో ఒక దర్శకుడు మాట్లాడుతూ ట్రాజెడీ కింగ్‌గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న దిలీప్ కుమార్ కూడా ఆమె నటించినంత బాగా తను నటించలేకపోయానని చెప్పారట. అలాగే రాజ్‌కుమార్ లాంటి నటుడుగా కూడా ఆమెతో నటించే సమయంలో డైలాగులు మర్చిపోయేవారట. పాతతరం హీరోయిన్లలో మధుబాలలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఆమె కూడా మీనాకుమారికి అభిమాని. ఆమె గొంతు ఎంతో విలక్షణంగా ఉండేదని, ఆమెలాంటి గొంతు ఏ హీరోయిన్‌కీ లేదని మధుబాల అభిప్రాయపడేది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న మీనాకుమారి వ్యక్తిగత జీవితాన్ని, సినీ జీవితాన్ని తెరకెక్కించాలంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత లోతుగా పరిశోధన చెయ్యాలి? అందుకే ఈ బయోపిక్ కోసం మరింత సమయం తీసుకొని ఓ క్లాసిక్‌గా మీనాకుమారి బయోపిక్‌ని నిర్మించాలని ఈ నిర్ణయం తీసుకున్నారట మేకర్స్.